12, జులై 2013, శుక్రవారం

డెహరాడూన్

డెహరాడూన్

File:Uttrakhand 108 First Aid.jpg
డెహ్రాదూన్ 

యమునోత్రి నుండి మేము బయలు దేరి డెహరాడూన్ వైపు ప్రయాణం సాగించాం. కాని ఈ ప్రయాణంలో మాకు మధ్యలో మజిలీ లేదు. ఇక్కడ నుండి బయలు దేరి డెహరాడూన్ మీదుగా ప్రయాణించి నేరుగా ౠషికేశ్ చేరుకుంటాం. ఋషికేశ్ చేరామంటే హిమాలయాలను వదిలివేసినట్లే. ఎంత శ్రమతో కూడిన ప్రయాణమైనా దేవభూమి అయిన హిమాలయాలను వదలడానికి మనసు కొంత భారంగా తోచింది. పది రోజులకే ఇంత అనుబంధం ఏర్పడింది మరి.  కిందకు  దిగుతున్నప్పుడు ప్రయాణం సులువుగా చేస్తున్నట్లు అనిపించింది. అదే ఘాట్  రోడ్లే అయినా పోయే సమయంలో ఇంకా ఎంతసేపులో చేరుకుంటామో అన్న ఆందోళన ఉంటుంది. వచ్చేటప్పుడు అది ఉండదు అందుకేనేమో. తిరుగు ప్రయాణంలో అంతగా కాలం జరిగినట్లుగాని శ్రమ కాని తెలియలేదు  .

మార్గ మధ్యంలో మధ్యాహ్న భొజనాలు ముగించుకున్నాము. హిమాలయాల్లో ఈ పర్వతవాతావరణంలో ఇలా అందరితో చేరి భోజనాలు చేయడం చాలా సరదాగా ఉంది. సాయంకాలం అయ్యే సమయానికి డెహరాడూన్ చేరుకున్నాము. హిమాలయాలులో ప్రవేశిన్చిన తరువాత మొదటి సారిగా అధికంగా భవనాలను చూసాము. మార్గానికి ఇరువైపులా కొన్డలూ వాటిమీద ఇళ్ళూ ఊరు చాలా అందంగా ఉంది. పర్వత ప్రాంతంలో  ఇలాంటి ఊరు చూడడం ఇదే మొదటిసారి కనుక మరింత అందంగా ఉంది. కొండ చరియల చివరి భాగం అంతా భవనాల వరుసలు. ఈ భవనాల వరుసలు చూడడానికి చాలా బాగున్నాయి. ఇలా ఊరు చూస్తూ ముందుకు సాగాము. మా యాత్రలో డెహ్రాడూన్ సందర్శన లేదు. కనుక ప్రయాణిస్తూనే ఊరు చూడలి.

File:Bsgate.jpg
డెహ్రాడూన్ పాఠశాల 
ఇలా కొంత దూరం చేరగానే వడగళ్ళ వాన మొదలైంది. బస్సు మీద వడగళ్ళు పడడం వలన పెద్దగా శబ్దాలు మొదలయ్యాయి.  బసును ఆపి వాన కొంచం తగ్గాక అందరం కిందికి దిగాం. కిందికి దిగి చూసి రోడ్డంతా మల్లెపూలలా పడి ఉన్న వడగళ్ళను చూసి ఆనందించాం. వడగళ్ళు కొంచం పెద్ద సైజులో అధిక సంఖ్యలో పడ్డాయి కనుక ఒక్క సారిగా అన్ని వడగళ్లను చూసే అవకాశం లభించింది. అవి కరగడానికి చలాసమయం పట్టింది. మేము అలా నిలిచి చూస్తుండగానే వాన మొదలు కావడమేగాక చాలా త్వరగా జోరందుకుంది.  ఇక మేము వాన నుండి తప్పించుకునే ప్రయత్నం చేయక తప్పలేదు. మెల్లగా అందరం సమీపంలోని శివాలయంలోకి ప్రవేశించాం. అది పెద్ద శివాలయమే. లోపలకు ప్రవేశించి ఆలయం అంతటా తిరిగి  చూసి స్వామిని దర్శించుకున్నాము. వాన తగ్గిందని  అనుకున్నాక అక్కడ నుండి నడిచి బసు వద్దకు చేరుకుని తిరిగి ప్రయాణం సాగించాం. దెహ్రాడూన్ నగరంలో చూడకపోయినా ఈలా డెహ్రాడూన్ సందర్శించడం కూడా చక్కని అనుభూతిని ఇచ్చింది. అక్కడి నుండి రాత్రికి ౠషికేశ్  చేరుకున్నాము.  అక్కడ చిన్నజీయర్ మఠంలో బస చేసాం. 

9, జులై 2013, మంగళవారం

యమునోత్రి

 యమునోత్రి 

File:Yamunotri temple and ashram.jpg
యమునోత్రి దృశ్యం



యమునోత్రి అంటే యమునానది జన్మస్థలము. యమునా నది జన్మించిన ఈ ప్రదేశములో యమునాదేవి ఆలయము ఉంది. ఈ ఆలయం టెహ్రీ గార్వాల్ మహారాజాచే నిర్మించబడినదని కథనం. ప్రస్తుత ఆలయాన్ని జయపూర్ మహారాణి గులారియా 19వశతాబ్ధంలో నిర్మించబడింది.పాత ఆలయం వాతావరణం మరియు ఇతర కారణాల వలన శ్ధిలస్థితికి చేరుకున్న తరువాత జయపూరు రాణిచే ఆలయం పునర్నిర్మించబడింది. కొన్ని చిన్న చిన్న ఆశ్రమాలు మరియు గెస్ట్‌హౌసులు కాక ఆలయసమీపంలో నివసించడానికి వసతులు తక్కువ. యాత్రీకులు సమీపంలోని రాణిచెట్టి తదితర ప్రాంతాలలో బసచేసి ఆలయానికి చేరి నదీమాతను దర్శించి వెనుతిరుగుతుంటారు. ఇక్కడి ఉష్ణకుండ స్నానం యాత్రీకుల శ్రమాంతర ప్రయాణానికి కొంత సేదతీరుస్తుంది.

సూర్యుని భార్య అయిన సంధ్యాదేవికి ముగ్గురు సంతానం. వారు శని,యముడు మరియు యమున.సంధ్యాదేవి సూర్యతాపానికి ఓర్వలేక తన ఛాయను తన స్థానంలో తన ఛాయను ఉంచి తపమాచరించడానికి వెళ్ళింది. ఛాయాదేవికి సూర్యుని వలన కలిగారు. తరువాత ఛాయాదేవి సంధ్యాదేవి కుమారుల పట్ల కొంత అశ్రద్ధను చూపించసాగింది. ఒక రోజు ఛాయాదేవి తన కుమారులకు ఆహారాన్ని అందించి సంధ్యా దేవి సంతానానికి ఆహారాన్ని అందించడానికి నిరాకరించడంతో శని కోపించి ఛాయాదేవిని కాలితో తన్నాడు. ఛాయాదేవి కోపించి శనిని కుంటివాడివికా శపించింది.ఇది గమనించిన సూర్యుడు శనిని తల్లిని తన్నిన కారణమడిగాడు,శని చెప్పినది విని సూర్యునికి ఛాయా దేవి మీద సందేహం కలిగి కన్న తల్లివైతే ఇలా చేయవు అసలు నీవెవరు అని ఆమెను నిలదీయగా తను సంధ్యను కానని ఆమెచే నియమించబడిన ఛాయాదేవినని నిజం చెప్పింది. ఈ సంఘటన తరువాత శని యమూడు ఆప్రదేశాన్ని విడిచి పోతారు. యముడు శువునికి సహాయంగా మరణానంతరం ప్రాణులకు పాపం చేసినందుకు దండననిచ్చే నరకాధిపతి అయ్యాడు. దండన ఇవ్వడంలో సమానంగా వ్యవహరిస్తాడని పురాణ కథనం. అన్నదమ్ముల వియోగాన్ని సహించలేక యమున కన్నీరు మున్నీరుగా ఏడ్వగా ఆమెకన్నీరు నదిగా ప్రవహించినట్లు పురాణ కథనం కొన్నిచోట్ల ప్రచారంలో ఉంది.

యమునోత్రి వర్ణచిత్రం
కేదార్నాథుని దర్శనం చేసుకుని మరునాడు ఉదయం బయలుదేరి రాత్రి అయ్యేసరికి జానకిచట్టి చేరుకున్నాము.  ఉదయం జానకి చట్టీ నుండి హనుమాన్ చట్టికి వేను మాట్లాడుకుని జట్లు  జట్లుగా చేరుకున్నాము. అక్కడ డోలీ వాలాలు భారతీయులు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కౌంటర్ నుండి డోలీ టోకెన్లు కొనుక్కున్నాము. ఆ టోకెన్లు చూపి డోలీలు మాట్లాడుకుని మా మా డోలీలలో యమునోత్రి చూడడానికి ప్రయాణం సాగించాము. డోలీ వాలాలకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము అంగీకారం కానట్లుంది వారు మా నుండి అధికంగా తీసుకోవడనికి ప్రయత్నించారు. అయినప్పటికీ మా బృందంలోని వారు అందుకు అంగీకారం తెలుపక ప్రభుత్వం నిర్ణయించిన రుసుము మాత్రమే చెల్లించారు. ఎలాగో డోలీలలో ముందుకు సాగాము. మార్గ మద్యంలో అప్పుడప్పుడు డోలీ వాలలు డోలీ దిగి నడవమన్నారు. వారు కూడ మనుషులే కదా అనిపించింది అదీ కాక ఇలా శ్రమపడి యాత్రచేయడం కూడా మంచిదే కదా అనిపించింది. అందువలన దిగి అక్కడక్కడా  నడక సాగింది.  డోలీ ఎక్కిన తరువాత ఎవరికి వారే కదా. కాబట్టి మార్గమద్యంలో ఎవరి నిర్ణయం వారిదే కదా.






దస్త్రం:యమునోత్రిలో డోలీ.JPG
 యమునోత్రి వద్ద డోలిలు 
ఎలాగో మద్యాహ్న సమయానికి ఆలయం సమీపానికి చేరుకున్నాము. మావారు వచ్చే వరకు ఆగి వారిని కలుసుకుని నడక సాగిస్తూ అటుఇటు ఉన్న లోయలు చూస్తూ ప్రయాణం సాగించాం. అయినా ఇంకా రావలసినవారు అందరూ ఇంకా వచ్చి చేరలేదు.డోలీలు దిగి మార్గ మద్యంలో ఆ పర్వత మార్గంలో పక్కన ఉన్న లోయలలో ప్రవహిస్తున్నయమునా నదిని చూస్తూ ప్రయాణం సాగించాం. జన్మస్థలంలోయమునా  నది చిన్న ప్రవాహంలా ప్రవహిస్తున్నది.  అయినప్పటికీ నది కొంచంలో లోతుగా ప్రవహిస్తున్నందున కారణంగా నదిని చేరడం మాకు కస్టమనిపించింది.  అందరూ ఏమి చేస్తే అదే చ్స్తామని అనుకున్నాము. కొంతమంది నది దగ్గరకు నడిచి పోతూనే ఉన్నారు.
దస్త్రం:యమునోత్రిలో స్నానఘట్టం.JPG
యమునోత్రి వద్ద స్నానఘట్టం 


File:Yamuna at Yamunotri.JPG
యమునోత్రి వద్ద యమునా నది 
అలా ఆలయసమీపానికి పోయే సమయానికి పుజా ద్రవ్యాలను విక్రయిస్తున్న చిన్న దుకాణాలను చేరుకున్నాము. అక్కడ నర్మదా దేవి పూజా ద్రవ్యాలతో ఒక చిన్న బియ్యం మూట తెల్లని వస్త్రంలో చుట్టి విక్రయిస్తున్నారు. అది ఆలయం పక్కనే ఉన్న చిన్న ఉష్న గుండంలో  వండి ఇస్తారు. అందుకు కొంత మూల్యం ఇవ్వాలి. సరే అనదరూ ఏమి చేస్తే అదే చేయాలని నిర్ణయించుకున్నాం. పూజా ద్రవ్యాలను కొని తిరిగి నడకతో ఆలయసమీపానికి చేరుకున్నాము. అక్కడ మాకంటే ముందు చేరుకున్న మా బృందం వారిని  కలుసుకున్నాము. వారి కుటున్బ సభ్యులు ఇంకా చేరని కారణంగా వారిలో కొంతమంది ఒంటరిగా ఉన్నారు. వారు కుటుంబంలో చేరేవరకు వారు ఇలా అశాంతిగానే ఉంటారు. 
యమునాదేవి ఆలయ సమీపంలో 
ఆలయం సమీపంలో పెద్ద ఉష్ణగుండం ఉంది. అక్కడ యాత్రీకులు స్నానం చేస్తున్నారు. మాకది ముందుగా తెలియదు కనుక మేము మావెంట వేరే జత దుస్తులు తీసుకు వెళ్ల లేదు. అందువలన స్నానం చేసే ప్రయత్నం మానుకుని చిన్న ఉష్ణ గుండం వద్దకు చేరుకునాము. అక్కడ ఉన్నవారుకి మూల్యం చెల్లించి బియ్యం మూటను వండించాము. ఉష్ణగుండం మీద ఒక బలమైన  ఇనుప జల్లెడ వేసి ఉంది.  ఆ ఇనుపజల్లెడకు చిన్న పురికొసలు కట్టి ఉన్నాయి. ఆ త్రాళ్ళతో బియ్యం మూటలు కట్టి వాటిని కింద సలసలా  కాగుతున్న  నీటిలోకి విడుస్తారు. కొంత సమయం మాత్రం ఉంచి వాటిని పైకి తీసి త్రాళ్ళ నుండి వాటిని విడదీది యాత్రీకులకు ఇస్తారు. మేము అలా ఆ బియ్యాన్ని వండించి తీసి చూసాము. సగం సగంగా ఉడికింది. మేము వాటిని అలా వదిలి వేసాము.
యమునోత్రి వద్ద ఉష్ణ కుండం 

తరువాత మేము ఆలయానికి చేరుకున్నాము. ఆలయం చాలా చిన్నది. అయినప్పటికీ ఈ ఆలయాలు ఋషి స్థాపితాలు అనుక మహిమాన్వితమైనవి. వెలుపల మా పూజా ద్రవ్యాలను తీసుకుని అక్కడ ఉన్న పూజారి పూజ విదులను సాగించాడు.  పూజ ముగిసిన తరువాత ప్రసాదం స్వీకరించి వెలుపలకు వచ్చాము. యాత్ర నిర్వాహకులు మా కోసం మద్యాహ్న భోజనం తీసుకు వస్తామని చెప్పారు. అయినా వారెవరూ వచ్చి చేరలేదు. అందరూ రావాలంటే ఇంకా ఆలస్యం కావచ్చు. అందుకని మేము ఆహారం కొరకు ఎదురుచూడకుండా వెనుతిరగాలని నిశ్చయించుకున్నాము. మిగిలిన వారు మధ్యాహ్న భోజనం తీసుకుని  వస్తామని చెప్పారు కనుక భోజనం చేసి వస్తామని చెప్పడంతో మేము మాత్రం వెనుతిరిగాము. తిరిగి డోలీలు ఎక్కి తిరుగు ప్రయాణం సాగించాం. కిందకు దిగి డోలీల నుండి వెలుపలకు వచ్చి విడుదల లభించినట్లు అనుభూతి చెందాం.  ఔను మరి మోసేవాళ్ళు మోస్తున్నప్పటికీ ఇరుకైన డోలీలో అంతసేపు ముడుచుకు కూర్చోవడం కష్టమే.
యమునోత్రి సమగ్ర దృశ్యం 

అక్కడి నుండి బసచేరాలంటే మాజట్టు వారి కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే మేము అక్కడి నుండి వ్యానులలో వెళ్ళాలి. ఒక్కో వ్యానుకు 7 మంది ఎక్కాలి. అదీ కాక ఈ యాత్ర ఆరంభం నుండి ఇలాంటి వ్యాను ప్రయాణాలకు మాలో మేము ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డాం. కనుక మా బృందం వారు వచ్చే వరకు ఆగి చూసి వ్యానులో బసకు చేరుకున్నాము. అంటితో మా యమునోత్రి యాత్ర పూrtiఋతి అయినట్లే. మరునాటి ఉదయం బయలుదేరి ఇక హిమాలయాలు వదిలి పెడతాము .  

17, ఫిబ్రవరి 2013, ఆదివారం

కేదార్నాథ్

కేదార్నాథ్ 


కేదారీశ్వరాలయం 


ఇలా ఉంటాయి ఆ గుడారాలు 
మంచుతెరల మద్య  కేదారీశ్వరుడు 
గంగోత్రి తరువాత మా గమ్యం కేదార్నాథ్ దర్శనం. గంగోత్రి చూసుకుని ఉత్తరకాశిలో బసచేసి మేము ఉదయాన్నే  బయలుదేరి గౌరీకుండ్ వైపు పయనం సాగించాం.  మార్గ మద్యంలో టీ కాఫీలు త్రాగే సమయంలో కొన్ని గుడారాలను చూసాం అవి మాబృందం వారికి చాలా ఆసక్తి కలిగించాయి. కోంచెం దిగువలో ఉన్న ఆ గుడరాలను వారి అనుమతితో పరిశీ లనగా చూసాం. అవి ఉత్తర భారత పర్యాటాకుల గుడారాలు. వారు కూడా యాత్ర చేస్తున్నవారే. ఇలాంటి యాత్రలను కూడా నిర్వహిస్తారని వారిని అడిగి తెలుసుకున్నాము. ఒక్కో గుడారాలలో పడకలు వంటి  అత్యావసర వసతులు ఉన్నాయి. అందరికీ ప్రత్యేకంగా మరొక గుడారంలో భోజనశాల కూడా ఉంది. మా బృందం వారికి అలాంటి యాత్ర చేయాలన్న ఆసక్తి కలిగింది. ఇలా ప్రయాణం లోని మద్య మద్య మజిలీలను కూడా ఆశ్వాదిస్తూ ముందుకు సాగాం.
గౌరీ కుండ్ 

గౌరికుండ్ రద్దీ 
గౌరికుండ్ బస్ స్టాండ్ 
రాత్రి సమయానికి గౌరీకుండ్ చేరాం.  యధా ప్రకారం మూడు కిలో మీటర్ల దూరంలోన్రే బస్సు ఆగింది. అయినప్పటికీ నిర్వాహకులు వ్యానులలో మా అందరిని మా  సామానులతో సహా  బస వద్దకు  చేర్చారు నిర్వాహకులు.  వ్యాను దిగి సామానులు మోయడానికి మనుషులను ఏర్పాటు చేసుకుని కోచెం దూతంలో ఉన్న బసకు బయలుదేరాం. దారిలో మనుషుల  రద్దీ ఎక్కువగా ఉంది. యాత్రీకులకు నాలుగు రెట్లు సహాయకులు కావాలి కనుక ఊరంతా వారితో నిండి ఉంది. వారే యాత్రీకుల సామాను తీసుకు వెళ్లడానికి కూడా సహకరిస్తారు. మేము చిన్నగా ఏలాగో బసకు చేరుకున్నాము. అక్కడ మాకు గదులను ఇవ్వగానే గదులకు చేరుకుని రాత్రి ఆహారం తీసుకుని విశ్రమించాం. 

కేదార్నాథ్ ఆలయానికి తీసుకుపోయే గుర్రాలు ఇలా ఉంటాయి 


వంపులు తిరిగిన ఘాట్ మార్గం 
14 కిలోమీటర్ల కేదార్నాథ్ మార్గంలో ప్రవేశం 
మరుసటి రోజు నిద్రలేచి  స్నానం చెయ్యడనికి వేడి నీరు తెప్పించుకుని స్నానాలు కానిచ్చాం. అసలు గౌరీ కుండ్ లో స్నానం చెయ్యడానికి ఉష్ణకుండం ఉందని చెపారు అయొనప్పటికీ అది ఎక్కడుందో తెలుసుకుని స్నానాలు చేసి తిరిగి బసకు చేరడానికి  సమయం కావాలి. మాకు అంత సమయం లేదు కనుక గదులలలోనే స్నానాలు చేసి ప్రయాణానికి సిద్ధం అయ్యాము. గౌరీ కుండ్ నుండి కేదార్నాథ్ 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.


ప్రయాణానికి సిద్ధంగా ఉన్న గుర్రాలు 
చీకటి పడేవేళకి రానూ పోనూ  28 కిలో  మీటర్లదూరాన్ని  ప్రయాణించి బసకుచేరాలి కనుక మా గదిలో నే స్నానాలు ముగించి ఫలహారం తిని ప్రయాణనికి సిద్ధం అయ్యాము. గౌరీ కుండ్ నుండి కేదార్నాథ్ కొండ  మార్గంలో ప్రయాణం చెయ్యాలి.  కేదార్నాథ్ మర్గం ఎగుడు దిగుడుగా వంపులు తిరిగి ఉంటుంది. సాధారణంగా  యాత్రికులు  ఆ మార్గంలోనడిచి వెళ్లి ఒక రోజులో స్వామిని దర్శించి తిరిగి కిందకు చేరుకోవడం సాధ్యం కాని పని. కనుక డొలీలు, చిన్నసైజు గుర్రాలు వంటి వాటిలో ప్రయాణించాలి.
గౌరీకుండ్ దృశ్యం 


Name:  100_7401.JPG
Views: 348
Size:  265.6 KB
గౌరీకుండ్ 
Temple at the hot springs - Gaurikund
గౌరీమందిర్ 
మేము బయలుదేరడనికి ముందు అక్కడ ఉన్న ఆలయాలను దర్శించడానికి వెళ్ళాము. ఆలయాలు బసకు సమీపంలోనే ఉన్నాయి కనుక కాలినడకన వెళ్లము. అక్కడాకు వెళ్లిన తరువాత అక్కడే ఉస్హ్ణ గుండం ఉందని తెలుసుకుని అక్కడ స్నానం చెయ్యలేక పొయ్యామని అనుకున్నాము. పరవాలేదనుకుని అక్కడి ఆలయాలు దర్శించుకున్నాము. ఆలయాలు అన్నీ సాధారణంగా ఉన్నా అవి మహర్షుల పాదస్పర్శ కలిగినవన్న స్పృహ కలిగి  మనసులో ఆనందానుభూతి కలిగించింది. ఆలయదర్శనం తరువాత అంతా చూసి బసకు వచ్చి చేరాము.
గురాలపై యాత్రకు 

డోలీ వాళ్ళు వచ్చి  పైకి తీసుకు వెళతామని మా వెంట తిరుగుతూ  అడుగుతూనే ఉన్నారు. నిర్వాహకులు అందరికీ డోలీలను మాట్లాడి ఏర్పాటు చేసారు. కొంతమంది మాత్రం గుర్రాలను మాట్లాడుకున్నారు. మా బృందంలో స్త్రీలలో చాలామంది ప్రయాణానికి అనువుగా చుడిదార్లు వేసుకున్నారు. 
యాత్ర ఆరంభం 
హోటల్ నిర్వాహం ఆక్సిజన్ సిలిండర్ కొనవలసిన  అవసరమ్ని చెప్పారు. కెదార్నాథ్ ఆలయానికి చేరే వేళకు ఎత్తు, చలి కారణంగా వాయుసంబంధమైన సమస్యలు రావచ్చని అందువలన  ఆక్సిజన్ అవసరమని చెప్పారు. మేమంతా డోలీలు ఉందే ప్రదేశనికి చేరుకున్నాము. అందరం దారిలో తినడానికి బిస్కట్లు వంటివి  జాగ్రత్త చేసుకున్నము. డోలీలు ఎక్కడంటే అక్కడ ఆగవు కనుక సాయంత్రం వరకూ ప్రయాణం చెయ్యాలి కనుక  మద్యలో ఆకలి భరించడానికి వాటి అవసరం ఉంది. ఒక్కో మనిషి ఒక్కో డోలీ కావాలి కనుక ఎవరికి వాళ్ళం వారి వారి డొలీల వద్దకు చేరుకున్నాము.  డొలీ ఎక్కాము అంటే ఇక మా వాళ్ళతో కూడా మాకు మట్లాడే వీళు ఉండదు. ఎందుకంటే  డోలీలు ఒకరి కొరకు ఒకరు ఆగి వెళ్ళడానికి వీలుకాదు. ప్రయాణం అలా ఉంటుంది. డోలీలను  ముందుగా ఊరి మధ్యలో నుండి తీసుకు పోతారు.
గుర్తింపు కార్డుతో నేపాలీ డోలీవాలా 


కేదార్ మార్గం
ముందుగా డోలీ  ప్రయాణం, కేదార్ మార్గం, డోలీ వారి సౌజన్యం చెప్పక తప్పదు.  కేదార్ యాత్రలో వీటీకి అంత ప్రాధాన్యం ఉంది. డోలీలను ఇక్కడ నేపాలీలు తీసుకు వెళుతుంటారు. ఆలయం తెరిచిన ఆరునెలల కాలం  వారు ఇక్కడే నివసించి ఆలయ దర్శనానికి యాత్రీకుల రాక నిలిపిన తరువాత వారి దేశం చేరుకుంటారు. ఇక్కడికి వారు కాలినడకన వచ్చి చేరుకుంటారు. ఆరుమాసాలు వారు ఇక్కడ వారి కుటుంబాలకు దూరంగా గడుపుతారన్న మాట . వీరు అతి సౌజన్యం, స్నేహభావం, సేవానిరతి కలిగిన వారు.  వీరికి చెల్లించే మూల్యం కంటే  వీరి సేవలు అమూల్యమైనవి, మరువరానివి. యాత్రీకులకు కేదార్నాథ్ దర్శనం చేయించే పుణ్యాత్ములు వారు అనక తప్పదు. వారి సేవ  లభించకుంటే మాలాంటి వారికి కేదారనాథుని దర్శనం దుర్లభం అంటే అతిశయోక్తి కాదు. వారు యాత్రీకులను తల్లి తంద్రులలా భావిస్తారు. వీరు నిజాయితీ  పరులు కూడా. భారతీయులలో ఇంతటి నిజాయితీ పరులు లభించడం కష్టమన్న తలంపు మనసును చాలా బాధ కలిగించింది.


కేదార్ మార్గం ఇలా ఉంటుంది 


కేదార్ మార్గం
కేదార్ మార్గం  ఇరుకైనది. కొండల వెంట ఎగుడుదిగుడుగా ఉండే ఇరుకైన మార్గంలో డోలీలు, గురాలు, కాలిబాటన పోయే యాత్రికులు పోయేవారు  వచ్చే వారు ఒక వైపు ఇలా వస్తుంటారు కనుక మార్గం చాలా రద్దీగా ఉంటుంది. ఆ ఇరుకులో డోలీలను మోసే వారు ఎదురుగా వచ్చే వారిని తప్పించుకుంటూ వెళ్ళడం చాలా శ్రమతో కూడుకున్నది. చూసేవారికి ఒకరికి ఒకరు గుద్దుకుంటారన్న సందేహం కలుగుతూ ఉంటుంది.  వారు అంత వేగంగా నడుస్తూ ఉంటారు. అయినప్పటికీ డోలీ వారు అతి లాఘవంగానూ  అదే సమయం వేగంగానూ సాగిపోతూ ఉంటారు. అయినప్పటికీ అటూ  ఇటూ  పెద్ద పెద్ద  లోయలు ఉంటాయి. కింద పడితే ప్రాణాల మీద ఆశ వదులుకోవలసిందే. అయినప్పటికీ అలాంటివి చాలా అరుదుగానే జరుగుతుంటాయి కనుక భయపడ వలసిన అవసరం లేదు.

నలుగు మనుషులు మోసుకు పోయే డోలీలు ఇవే 

నలుగురు మోసుకుపోయే డోలీ 
డోలీలు కూడ చెప్పుకోవలసినట్లు ఉంటాయి. వీటి తయారీకి కొయ్య బద్దలను వాడాతారు. చిన్నగా ఇరుకుగా ఉంటాయి. బాదంకాయ ఆకారంలో షుమారుగా  రెండు అడుగుల ఎత్తులో ఉంటాయి.  వాటిలో ఎక్కాలన్న దిగాలన్నా వారి సహాయం  తీసుకోవాలి. డోలీలలో  ఎక్కి కాళ్ళు ముడుచుకుని కుదురుగా కూర్చోవాలి.  డోలీలకు రెండు  వైపులా పల్లకీలలో ఉండేలా రెండు పొడవాటి లావైన కొయ్యలు  ఉంటాయి  వాటికి అడ్డంగా రెండూ మందపాటి కర్రలను కట్టి వేస్తారు. వాటి సాయంతో యాత్రీకులను నలుగురు మనుషులు మోసుకు పోతుంటారు. రెండు గంటలకు ఒక సారి డోలీని కిందకు దింపి విశ్రాంతి తీసుకుంటారు. రెండు గంటలు కాళ్ళు ముడుచుకుని తరువాత లేవాలంటే కాళ్ళు నొప్పుల కారణంగా సహకరించవు. అప్పుడంతా వారే చెయ్యి అందించి సహకరిస్తారు.

  

కాలినడకలో యాత్రికులు 
తాత్కాలిక రెయిన్ కోట్లలో యాత్రికులు 
మేము డోలీలలో ప్రయాణం మొదలు పెట్టగానే ప్రభుత్వోద్యోగి  రుసుము వసూలు చేసుకోడానికి ఆపాడు ఆయనకు రుసుము చెల్లించాలంటే చేతులు సహకరించ లేదు. రూపాయి నోట్లు ఒక దానితో ఒకటి కరచుకొని విడిగా తీయడానికి సాధ్యం కాలేదు. చలికి చేతులు అంతగా మొద్దుబారి పోయాయి. అప్పుడు ఆయనే పర్సులో నుండి ఇవ్వవలసిన మొత్తం తీసుకుకున్నాడు. అది ఇప్పుడు అనుకున్నా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది.  ఇలా ప్రయాణీస్తూ ఆగుతూ టీ, కాఫీలు సేవిస్తూ ముందుకు పోతున్న సమయంలో చిన్నగా వాన మొదలైంది. స్వెట్టర్, గ్లౌజులు వానలో తడిచాయి. అప్పటికి  చలి కొంచెం అలవాటు అయింది కనుక అంతగా కష్టం తెలియ లేదు. అయినా డోలీవారు డోలీ లను ఆపి మాకు ఫ్లాస్టీక్ తో తయారు చేసిన రెయిన్ కోట్లను కొని తెచ్చి తొడుగుకోవడానికి వారే సహకరించారు. 

కొండ చరియలలో యాత్రికులు 

ఎంతగా వారు అలవాటు పడిన వారైనా వారు డొలీని మోయడంలో శ్రమను అనుభవిస్తున్నారని భుజం మార్చుకోవడం భుజం మీద బట్టలు వేసుకోవడం చూస్తే తెలుస్తుంది. నాకు మాత్రం ఇలా మోయించుకోవడానికి చాలా బాధ వేసింది. అయినా ఇంత దూరం వచ్చి కేదారనాథుని  చూడకుండా వెళ్ళడానికి మనసు అంగీకరించక అర్ధమనసుతో యాత్రసాగించాను. ప్రయాణం సాగించినతరువాత ఇంత కంటే ఈ యాత్ర చేయడానికి వేరు మార్గం లేదని తెలుసుకుని కొంత మనసును సమాధానపరచుకున్నాను. రెండు గంటలు ప్రయాణించిన తరువాత డొలీ మోసేవారిలో ఒక వ్యక్తి ఇక మోయలేనని ఆగాడు.  ఇది నా మనసుని మరింత బాధించింది.  మిగిలిన వారు మరొక వ్యక్తిని  ఏర్పాటు చేసుకుని ప్రయాణం కొనసాగించారు. 
మార్గంలో మలుపు తిరుగుతూ 



విశ్రాంతి తీసుకునేది ఇక్కడే 
మార్గ మద్యంలో ఫలహార శాల 
ఒక్కోసారి రాత్రిలోగా పైకి చేరే అవకాశం  లేకుంటే అల్కడ ఉన్న హోటళ్ళలో రాత్రికి విశ్రమించి మరునాడు ప్రయాణం కొనసాగించవచ్చు. కొందరు అలాచేస్తుంటారని తెలుసుకున్నాను. మార్గ మద్యంలో ఉన్న దు కాణలకు కావలసిన అన్ని వస్తువులూ దాదాపు ఇలా నడక ద్వారానే చేరవేయాలి. ఇక్కడి వారిది అత్యంత శ్రమైక జీవితం. శ్రమించనిదే ఎవరికీ జీవితం గడవదు. మార్గంలో ఉన్న దుకాణాలన్నీ తాత్కాలిక మైనవే. ఆరుమాసాల అనంతరం ఖాళీ చేయబడతాయి. వాటి నిర్మాణానికి అవసరమైన సామాను పైకి చేర్చడం ఎంత కష్టమో ఆలోచించండి. వీరితో పోల్చుకుంటే ఎంతో వసతులతో జీవితాన్ని గడిపే మనలో కొంతమంది ఇంకా కావాని ఆరాటపడడం ఉన్నదానితో తృప్తి చెందక పోవడం ఎంత విచిత్రమైనదోకదా. 



పచ్చని సెలయేళ్ళు  కొండచరియలు




ఏటవాలు భూములలో వ్యవసాయక్షేత్రాలు 
ఆహ్లాదకరమైన జలపాతాలు 
ప్రయాణం ఎంత బడలికగా ఉన్నా చుట్టూ ఉన్న పరిసరాలు మాత్రం ఆహ్లాదకరంగా ఉన్నాయి. తరుచుగా దూరంగా జలపాతాలు  కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అదే మన ప్రాంతంలో అయితే  ఒక్క జలపాతం ఉంటే దానిని పర్యాటక కేంద్రం చేసి  ఎంత మంది పర్యాటకం చేయడానికి  వెళుతుంటారు. కాని ఇక్కడ వాటిని అంతగా పట్టించుకునే వారే లేరు. దారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన  కొండల మీద దేవదారు వృక్షాలు కనిపిస్తున్నాయి. బద్రీనాథ్ పర్వతాలకంటే ఇక్కడ పచ్చదనం ఎక్కువగా ఉంది. అది మనసుకు మరింత ఆహ్లాదం కలిగించింది. ఒక్కో చోట దూరం నుండి హిమశిఖరాలు కూడా కనిపిస్తున్నాయి. పర్వతాల ఆఖరి భాగాలలో హిమమయయం గానూ కింది భాగంలో మామూలుగాను ఉంటుంది.  


మార్గమద్యంలో 

ఒక్కోసారి రాత్రిలోగా పైకి చేరే అవకాశం  లేకుంటే అల్కడ ఉన్న హోటళ్ళలో రాత్రికి విశ్రమించి మరునాడు ప్రయాణం కొనసాగించవచ్చు. కొందరు అలాచేస్తుంటారని డోలి వారిని అడిగి  తెలుసుకున్నాను. మార్గ మద్యంలో ఉన్న దుకాణలకు కావలసిన అన్ని వస్తువులూ దాదాపు ఇలా నడక ద్వారానే చేరవేయాలి. ఇక్కడి వారిది అత్యంత శ్రమైక జీవితం. శ్రమించనిదే ఎవరికీ జీవితం గడవదు. మార్గంలో ఉన్న దుకాణాలన్నీ తాత్కాలిక మైనవే. ఆరుమాసాల అనంతరం ఖాళీ చేయబడతాయి. వాటి నిర్మాణానికి సామాను పైకి చేర్చడం ఎంత కష్టమో ఆలోచించండి. వీరితో పోల్చుకుంటే ఎంతో వసతులతో జీవితాన్ని గడిపే మనలో కొంతమంది ఇంకా కావాని ఆరాటపడడం ఉన్నదానితో తృప్తి చెందక పోవడం ఎంత విచిత్రమైనదోకదా.
ఒకే మనిషి మోసే దోలి ఇలా ఉంటుంది

కాలినడకలో యాత్రికులు 
ఇలా కొంతదూరం పోయే సమయానికి  డోలీలో పోతున్నా అందరూ వాడి  పోయారు.  ఒక్కో సారి మా బృందం వారు ఎదురైనా గమనించే స్థితిలో కూడా లేము. కొంతమంది యాత్రికులను బుట్టలలో  మోసుకు పోతున్నారు.  టీ తోటలలో ఉపయోగించే బుట్టలలో మనిషిని కూచోబెట్టుకుని వీపుకు తగిలించుకుని తీసుకు పోతుంటారు. ఒక మనిషిని ఒకరు మోసుకు పోతారు. ఇక్కడ ఈ బుట్టలను సామాను మోయడనికి కూడా వాడడం చూసాము. చిత్రమేమిటంటే మొసే వారి కటే  కుర్చున్న వారు అలసటతో వాలి పోతున్నారు.  ఇంకా విచిత్రం ఏమంటే మా కంటే వయోధికులు చక్కగా చేకర్రల సాయంతో నడిచిపోతూ ఉండడమే. 
మార్గ మద్యలో రమణీయమైన దృశ్యాలు 


ఇంకా ముందుకు పోయిన తరువాత మా బృందం వారు వెనక్కి రావడం గమనించాను. వారు ఈ ప్రయాణం కొనసాగించ లేక వెనుతిరిగారని తరువాత తెలిసింది.  ఇలా మా బృందం వారు 11 మంది వెనుతిరిగారు. అయినప్పటికీ  నేను మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఆఖరి వరకూ ప్రయాణం కొనసాగించాలని నిర్ణ యించుకున్నాను. 
మంచుదుప్పటి కప్పుకున్న శిఖరాలు 

రెయిన్ కోటు  వేసుకున్న  తరువాత  వాన నుండి తప్పించున్నా విసురుగా వీస్తున్న  గాలి ఇబ్బంది పెట్టసాగింది. గాలికి  రెయిన్  కోటు తలమీద నిలవడం  కష్టమైంది. వాన  చినుకులు ఏటవాలుగా  కురుస్తూ  సూదులులా  గుచ్చుతున్నాయి. ఇంతవరకూ  ఇలాంటి  వాన చూడ లేదు.  వేగంగా  ఏటవాలుగా కురవడం  వలన  ఇలా  ఉందేమో . ఒకచేత్తో  రెయిన్ కోటు  సరిచేసుకుంటూ  ఒక చేయి  ముఖం  మీద  పెట్టుకుని  వాన నుండి  కాపాడుకోవలసి  వచ్చింది. క్రమంగా  వాన మంచుగా  మారింది. ఇప్పుడు  ముఖం  మీద మంచు  ముద్దలు  ముద్దలుగా  పడుతూ  కరిగిపోతూ  ఉంది.  చలి  వానలకు  శరీరం  కొద్దిగా  అలవాటు  పడింది. ఇప్పుడు అంతగా  ఇబ్బంది అనిపించ  లేదు.  ఇక్కడే  నివసిస్తే  ఈ వాతావరనానికి  అలవాటు  పడడం సులువులా  ఉంది.  డోలి వారు  ఇక  ఆలయానికి చేరువ ఔతున్నామని  మహాదేవుడిని స్మరిస్తూ  ఉండమని  చెప్పారు. నాకు తట్టని  విషయం వారు  చెప్పినందుకు  వారి  మీద సదభిప్రాయం  మరింత  ఎక్కువైనది.  మహేశ్వరుని  స్మరిస్తూ  కేదార్నాథ్  చేరడం  మరింత  అనందానుభుతి  కలిగించింది. ఇలా  చిన్నగా  శిఖరానికి చేరుకున్నాము.
శిఖరానికి చేరువ ఔతూ 

     
ఆలయానికి  షుమారు  రెండు కిలోమీటర్ల  దూరంలో  డోలి ఆపి వెళ్ళాలి  కనుక  డోలిలను  ఆపి  ఇక నడవాలని  చెప్పారు.  మా బృందం  వారు ఎవరూ కనిపించ  లేదు. ఇంత  కొత్త  ప్రదేశంలో  ఇలా  ఒంటరిగా  ఉండడం  ఇదే  మొదటి  సారి. ఏమి  చేయాలో  పాలు  పోలేదు. డోలి వారిలో  ఒకరు  నాతో  అందోళన  అవసరం  లేదని  తను  వెంట  వస్తానని  చెప్పాడు.   పరిచయం లేని  వారితో  ఇలా ప్రయాణం  చేయవలసి  రావడం  వింతగా  ఉన్నా  వారు చూపిన  ఆప్యాయత  మాత్రం కొత్తదనాన్ని పారదోలింది. ఇలా వారు యాత్రికులు అందరికీ  దర్శనం చేసే వరకు వెంట ఉండి సాయం చెస్తుంటారు.

ఆలయంలో ప్రవేశిస్తున్న భక్తులు 
ఆలయనికి వెళ్ళే  దారికి ఇరువైపులా పుజాసామానులు విక్రయించే దుకాణాలు ఉన్నాయి. ముందుగా వైద్య శిబిరం ఉంది. అక్కడ యాత్రుకులకు ప్రయాణం వలన ఎదైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే చికిత్స చేస్తారు. వెంట తీసుకు వెళ్ళిన అక్సిజన్ కావాలంటే ఉపయొగించుకోవడానికి  అవసరమైన సహకారం కూడా అందిస్తారు.  నాకు మాత్రం ఏమీ అవసరం అనిపించ లెదు. దారికి ఇరువైపులా మంచు అరుగులుగా పేరుకుని ఉంది.  అక్కడ కురిసే మంచును నెట్టి పెట్టడం వలన ఆ మంచు దిబ్బలు ఎర్పడ్డాయి. అంత ఎక్కువగా మంచును అంత సమీపంగా చూడడం అదే మొదటిసారి. ఆ చలికి ముక్కు ఎక్కువగా బిగుసుకు పొవడం వలన కుడా  కఫ బాధ ఎమి లేదు. గాలి చక్కగా పీల్చగలగడం ఆశ్చర్యాన్ని హాయిని కలిగించింది. 



కేదారీశ్వరాలయం ముందు 
కేదారీశ్వరుడు 
నివాస గృహాల మద్యలో కేదార్నాథ్ ఆలయం 
అలయానికి చేరగానే మాబృందం వారు ఒక్కరు ఒక్కరుగా కనిపించ సాగారు.  వారు నన్ను ఆలయానికి రమ్మని పిలిచారు. నేను మాత్రం మా వారి కొరకు ఆగాను. కొంచెం సమయానికి మా వారు రాగానే ఇద్దరం ఆలయం లోనికి ప్రవేసించాము.  మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి ఎక్కడం చాలా శ్రమ అనిపించింది.  చిన్నగా పైకి ఎక్కి ఆలయంలో ప్రవేశించాము.  ఆలయం చాలా చిన్నది. మహ ఋషులు  ఆరాధించిన ప్రదేశం ఈశ్వరుడు ప్రత్యక్షమైన దివ్యస్థలం, పాండవులు సేవించిన పవిత్ర క్షేత్రం, శంకరాచార్య పూజితం. అసలు నా జీవితంలో ఈ ఆలయాలు చుస్తానని అనుకో లేదు. ఇలా ఈ ఆలయదర్శనం చేసుకోవడం జీవితంలో మరువ లేనిది.  ఇంత శ్రమతో చూడడం మరింత ఆనందానుభూతిని ఇచ్చింది. గర్భాలయంలో ప్రవేశించే ముందు ఉన్న మందిరంలో  చుట్టూ ఉన్న గోడలకు పాండవులు, కుంతీ, ద్రౌపది, శ్రీకృష్ణుల చిత్రాలు ఉన్నాయి. గర్భాలయంలో ఈశ్వరుడి మీద వస్త్రం కప్పి ఉంది. ఇక్కడ ఈశ్వరుడు స్వయంభులింగం మానవ ప్రతిష్టితం కాదు. ఆలయ దర్శనం చేసుకుని తిరుగు ముఖం పట్టాము. ఇప్పుడు వాన తగ్గింది.
కొండ చరియల మద్య కేదార్నాథ్ ఊరు 

అక్కడ యాత్రికులకు మరుగుదొడ్డి సౌకర్యం కూడా ఉంది. అందరం మామా అవసరాలు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యాము. ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశంలో మంచు దిబ్బలు మరింత పెద్దవిగా ఉన్నాయి. అవి మట్టితో కలిసి కొంచెం ఎర్రగా ఉన్నాయి. అంత మంచును ఒక్కసారిగా చూడడం అదే మొదటిసారి. అదరం కలిసి నడుచుకుంటూ డోలీ నిలిపిన ప్రదేశానికి చేరుకుని తిరుగు ప్రయాణం సాగించాము. తిరిగి ఎవరికి వారుగా విడిపోయి  తిరుగు ప్రయాణంలో అక్కడక్కడా హోటళ్ళలో ఫలహారాలు తిని కాఫీ, టీలు త్రాగాము. ఈ హోటలులో అధికంగా పూరీ చపాతీలతో నూడిల్స్ ఆహారంగా తింటున్నారు.  తిరుగు ప్రయాణంలో డొలీ వారితో మాట్లాడుతూ ప్రయాణం సాగించాను. వారు వారి పిల్లల చదువుకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వరని పనిపాటలకే అధికంగా ప్రధాన్యత ఇస్తారని తెలుసుకున్నాను.  వారి స్త్రీలు వీరు వెళ్ళే వరకు కుటుంబ పోషణ చూసుకుంటారని చెపారు. . తిరుగు ప్రయాణంలో వాన కాని మంచుగాని లేదు.  వాన, ఎండ, మంచు మారి మారి ఉండడం ఇక్కడ సహజంలా ఉంది. ఈ వాతావరణం కొంత అలవాటు కావడంతో తిరుగురయాణం అంతగా ఇబ్బంది కరంగా లేదు. ఇలా ప్రయాణాం చేస్తూ కిందకు చేరడానికి సాయంత్రం ఆరు గంటలు దాటింది. 

కేదార్ ఆలయ పరిసరాలు 


కిందికి  రాగానే నన్ను మారి వద్దకు చేర్చి నిర్వాహకుల వద్ద వారికి రావలసిన ధనం తీసుకుని వారు వెళ్ళారు. ఇంత వరకూ ఆత్మీయతగా మాతాజీ అని మెలిగిన వారు నిశ్శబ్ధంగా వెనుతిరిగారు. వారి వృత్తి ధర్మం వారిది. మా యాత్రా ధర్మం మాది.  ఆ రాత్రి భోజన సమయంలో అందరూ వారి వారి అనుభవాలు చెప్పుకున్నారు.  అందరూ డోలీ వారి సేవలను శ్లాఘించిన  వారే. ఎవరూ వారికి అదనంగా పెట్టిన ఖర్చు కొరకు ఎవరూ బాధపడక పోవడం విచిత్రం. సాధారణంగా అదనపు ఖర్చుఅ విషయంలో ఇలా ఏకాభిప్రాయం కుదరదు. 




గురాలమీద యాత్ర 
గురాల మీద స్త్రీయాత్రికులు 
మా బృందంలో కొంతమంది గురాల మీద వెళ్ళారు. వారిలో ఒక స్త్రీ గుర్రం మీద నుండి కిందకు పడి తలకు గాయం అయింది. హాస్పిట వెళ్ళి కట్టు కట్టించుకుని తీసుకు వచ్చారు. వాస్తవానికి నాకు డోలీలలో అలా మోయబడడం మనస్కరించక గురం మీద వెళాలని అనికున్నాను. మావారు  అ దుకు అంగీకరించ లేదు. అది ఎంత మంచిదో ఇప్పుడు అర్ధం అయింది. గురాం వెంట యాత్రీకులతో ఒక వ్యక్తి నడుస్తూ వస్తాడు. అతడు గుర్రాన్ని అదుపు చేయడం మేత వేయడం నీరు త్రాగిం చడం వంటివి చెస్తుంటాడు. అయినప్పటికీ అక్కడాకాడా వాటి కొరకు ఏర్పాటు చేసిన నీటి తొట్టి చూసాయంటే అయి వేగంగా పరిగెడతాయి. అల్ల పరిగెత్తే సమయంలో ఆమె ఆందోళన చెంది పడిపోయానని చెప్పింది. కేదార్ మార్గం అక్కడక్కడా ఈ గుర్రాల మలమూత్రాల వలన చితచితగా ఉంటుంది.
కేదార్ కొండ ప్రాంతం 


మాయాత్రలో కేదార్ యాత్ర మకుటాయ మయమని చెప్పవచ్చు. కేదార్నాథుని దర్శనం అంతటి విచిత్రమైన అనుభూతిని ఇచ్చింది. ఎందరికో జీవిత కాలంలో లభించని ఆలయ దర్శనం ఈశ్వరుడు మాకు ప్రసాదించినందుకు మనసులోనే కృతఙత తెలిపుకున్నాను. మరునాడూ ఉదయం మేము యమునోత్రికి మా యాత్ర కొనసాగించాం.
కేదార్ యాత్రలో హెలికాఫ్టర్లు 

కేదార్ యాత్రకు హెలికాఫ్టర్లు లభ్యం ఔతాయి. వాటిని ముందుగా కొన్ని మాసాల ముందు బుక్ చేయాలి .  మాయాత్రలో ఆ ప్రణాళిక లేదు కనుక మా కవి లభ్యం కాలేదు. హెలికాఫ్టర్లలో వెళ్ళినా మూడు కిలోమీటర్ల దూరమైనా దోలి ప్రయాణం ఉంటుందని తెలిసింది. హెలికాఫ్టర్లు గౌరీ కుండ్ నుండి లభ్యం ఔతాయి. మార్గంలో హెలికాఫ్టర్లు పోవడం గమనించాము. అయినప్పటికీ   ఈ మార్గంలో పోవడం ఈ అనుభవం మేము చక్కగా ఆశ్వాదించాము.