డెహరాడూన్
 |
| డెహ్రాదూన్ |
యమునోత్రి నుండి మేము బయలు దేరి డెహరాడూన్ వైపు ప్రయాణం సాగించాం. కాని ఈ ప్రయాణంలో మాకు మధ్యలో మజిలీ లేదు. ఇక్కడ నుండి బయలు దేరి డెహరాడూన్ మీదుగా ప్రయాణించి నేరుగా ౠషికేశ్ చేరుకుంటాం. ఋషికేశ్ చేరామంటే హిమాలయాలను వదిలివేసినట్లే. ఎంత శ్రమతో కూడిన ప్రయాణమైనా దేవభూమి అయిన హిమాలయాలను వదలడానికి మనసు కొంత భారంగా తోచింది. పది రోజులకే ఇంత అనుబంధం ఏర్పడింది మరి. కిందకు దిగుతున్నప్పుడు ప్రయాణం సులువుగా చేస్తున్నట్లు అనిపించింది. అదే ఘాట్ రోడ్లే అయినా పోయే సమయంలో ఇంకా ఎంతసేపులో చేరుకుంటామో అన్న ఆందోళన ఉంటుంది. వచ్చేటప్పుడు అది ఉండదు అందుకేనేమో. తిరుగు ప్రయాణంలో అంతగా కాలం జరిగినట్లుగాని శ్రమ కాని తెలియలేదు .
మార్గ మధ్యంలో మధ్యాహ్న భొజనాలు ముగించుకున్నాము. హిమాలయాల్లో ఈ పర్వతవాతావరణంలో ఇలా అందరితో చేరి భోజనాలు చేయడం చాలా సరదాగా ఉంది. సాయంకాలం అయ్యే సమయానికి డెహరాడూన్ చేరుకున్నాము. హిమాలయాలులో ప్రవేశిన్చిన తరువాత మొదటి సారిగా అధికంగా భవనాలను చూసాము. మార్గానికి ఇరువైపులా కొన్డలూ వాటిమీద ఇళ్ళూ ఊరు చాలా అందంగా ఉంది. పర్వత ప్రాంతంలో ఇలాంటి ఊరు చూడడం ఇదే మొదటిసారి కనుక మరింత అందంగా ఉంది. కొండ చరియల చివరి భాగం అంతా భవనాల వరుసలు. ఈ భవనాల వరుసలు చూడడానికి చాలా బాగున్నాయి. ఇలా ఊరు చూస్తూ ముందుకు సాగాము. మా యాత్రలో డెహ్రాడూన్ సందర్శన లేదు. కనుక ప్రయాణిస్తూనే ఊరు చూడలి.
 |
| డెహ్రాడూన్ పాఠశాల |
ఇలా కొంత దూరం చేరగానే వడగళ్ళ వాన మొదలైంది. బస్సు మీద వడగళ్ళు పడడం వలన పెద్దగా శబ్దాలు మొదలయ్యాయి. బసును ఆపి వాన కొంచం తగ్గాక అందరం కిందికి దిగాం. కిందికి దిగి చూసి రోడ్డంతా మల్లెపూలలా పడి ఉన్న వడగళ్ళను చూసి ఆనందించాం. వడగళ్ళు కొంచం పెద్ద సైజులో అధిక సంఖ్యలో పడ్డాయి కనుక ఒక్క సారిగా అన్ని వడగళ్లను చూసే అవకాశం లభించింది. అవి కరగడానికి చలాసమయం పట్టింది. మేము అలా నిలిచి చూస్తుండగానే వాన మొదలు కావడమేగాక చాలా త్వరగా జోరందుకుంది. ఇక మేము వాన నుండి తప్పించుకునే ప్రయత్నం చేయక తప్పలేదు. మెల్లగా అందరం సమీపంలోని శివాలయంలోకి ప్రవేశించాం. అది పెద్ద శివాలయమే. లోపలకు ప్రవేశించి ఆలయం అంతటా తిరిగి చూసి స్వామిని దర్శించుకున్నాము. వాన తగ్గిందని అనుకున్నాక అక్కడ నుండి నడిచి బసు వద్దకు చేరుకుని తిరిగి ప్రయాణం సాగించాం. దెహ్రాడూన్ నగరంలో చూడకపోయినా ఈలా డెహ్రాడూన్ సందర్శించడం కూడా చక్కని అనుభూతిని ఇచ్చింది. అక్కడి నుండి రాత్రికి ౠషికేశ్ చేరుకున్నాము. అక్కడ చిన్నజీయర్ మఠంలో బస చేసాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి