8, జులై 2012, ఆదివారం

నక్షత్రాలు గుణగణాలు 3


 మూలానక్షత్రము గుణగణాలు 

మూలానక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యధిపతి గురువు, జంతువు శునకం. ఈ నక్షత్రములో పుట్టిన వారు శక్తిమంతులు. అసాధారాణ శక్తి వీరి స్వంతము. అసాధారణ ప్రతిభాపాతవాలు వీరి స్వంతం. చిన్న తనంలో బంధువుల నిరాదరణకు గురి ఔతారు. జీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరి స్వంతం. జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోక ముందుకు సాగడమే జీవితధ్యేయంగా ముందుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యం. బంధుత్వానికి, స్నేహాలకు, నైతిక ధర్మాలకు, దైవభీతికి  వీరి మనసులో స్థానం లేదు. కుటుంబం కొరకు, తల్లి తండ్రుల కొరకు కొంత త్యాగం చేస్తారు. అణుకువగా ఉండి సంసారం అన్యోన్యంగా ఉంది అనిపించుకుంటారు. ఆర్ధిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయం చేయరు. తనకు తెలిసినా మంచి మార్గాలు, సూచనలు వేరొకరికి చెప్పరు. రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యాలు చెయ్యడం కష్టతరమైన యజ్ఞం  ఔతుంది. కీలక సమయాలలో బంధువర్గ అండదండలు నయనో భయానో సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. భాగస్వాములు మోసగిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి. స్త్రీదేవతార్చన మంచిది. అరవై సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగి పోతుంది.


 పూర్వాషాఢ నక్షత్రము  గుణగణాలు

పూర్వాషాఢ నక్షత్రముకు అధిపతి శుక్రుడు, అది దేవత గంగ, మనుష్య గణం , జంతువు వానరం, రాశి అధిపతి గురువు. వీరు విలాసమంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చవి చూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు హరించుకు పోయి కొంత భాగం మాత్రం మిగులుతుంది. చాకచక్యం, కొంటె తనం వీరి స్వంతం. బాల్యజీవితం సుఖవంతము. వివాహ జీవితం సాధారణం. పుట్తిన ప్రామ్తానికి దూరంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నతస్థాయి సాధిస్తారు. స్నేహితులతో కలసి జీవితంలో విజయాలు సాధిస్తారు. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాలలో ఖ్యాతి రాణింపు లభిస్తుంది. కొంత కాలం తరువాత వీరున్న రంగంలో వీరి స్నెహితులు ఉన్నతి సాధించి వీరిని దూరంగా ఉంచుతారు. వీరి ఓర్పుకు సహనానికి పరీక్షలు ఎదురౌతాయి. ఎక్కువ కాలం ఓర్పు వహించ లేరు. సమాజంలో గౌరవానికి బదులు భయం చోటు చేసుకుంటుంది. ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు. సహోదరుల వలన అపఖ్యాతి లభిస్తుంది. నమ్మిన సేవకాజనం  మోసం చెస్తారు. సహోదరీ వర్గం అన్ని విధాలా సహకరిస్తారు. ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి స్వామీజీల పతల సదభిప్రాయం ఉంటుంది. దైవభీతి ఉంటుంది. విదేశీయానం కలుగుతుంది. విదేశీ వ్యాపారము, వ్యవహారము లాభిస్తాయి. సంతానము మీద ఎవ్వరి నీడ పడకుండా కాపాడతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ జీవితానికి సామాజిక జీవితానికి మద్య గోడను నిర్మించి జీవించడం మంచికి దారి తీస్తుంది.


 ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు 

ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు  మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలాఅలా ఎదుగుకొనుచు పైపైకే పోతారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరిఁకెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువఁగా మాట్లాడెదరు, అణకువ కలిఁగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుఁగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసిమెలిసియుండఁదలచుకొనెదరు, క్రొత్త స్నేహములు చేయుట నచ్చుకొనెదరు. కీలక సమయాలలో బాందవ్యానికి విలువ ఇవ్వరు. ఒకా నొకప్పుడు వీరు నేరప్రవృత్తి  అయిన  నడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది.  తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం ఔతాయి.  ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి , బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి ఔతారు తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు.  స్వంతవారిని వీరు  ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. నిజం చెప్పేటందుకు సరి అయిన తరుణం వచ్చినా కూడా వీరు పలుమార్లు  నిజం చెప్పరు. పై చదువులు వీరికి కలసి వస్తాయి.  వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు  వీరికి కలిసి వస్తాయి. తక్కినవారికి వీరు వీలు కలిగిస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మంచిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు.  వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది.   కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, థన సహాయంను చేస్తారు. తెలిసిన వారికి కూడా వీరు అప్పు కూడా ఇవ్వరు. ఆర్ధికపరమైన విషయాలను  దాచగలగటంలో  వీరు నేర్పరులు.

 శ్రవణా నక్షత్ర జాతకుల గుణగణాలు 


శ్రవణానక్షత్ర అధిపతి చంద్రుడు. అధిదేవత మహా విష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం. ఈ నక్షత్రజాతకులు మితభాషులు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా  నీరు ధర్మం తప్పక జీవితం సాగిస్తారు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికి అర్ధం కాదు. ఓర్పు ఉంటుంది కాని దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చుసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్థులు, వస్తువులు స్థిరాస్థులుగా లభించిన దాని కంటే స్వార్జితము ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి లోటు ఉండదు. అంచెలు అంచెలుగా పైకి వస్తారు. శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు. చదువు పట్ల శ్రద్ధ, సమాజములో ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగపరచుకొనుట, సందర్భాను సారము వ్యూహం చేయుట వీరి స్వంతం. అందరు వీరిని మొండి వాళ్ళు అని భావించినా విరికి విశాలహృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికి అర్ధం కాదు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపొయినా తరువాత మంచి లాభాలు గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది. అడుగడుగునా దైవం కాపాడుతాడు. వీరికి దైవాను గ్రహం ఎక్కువ.  వీరికి ఉండే దైవభక్తి, గుప్తదానాలు ఇందుకు కారణం. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది.

 ధనిష్ఠానక్షత్రము గుణగణాలు


ధనిష్ఠా నక్షత్ర అధిపతి కుజుడు, ఇది రాక్షస గణము, రాశ్యాధిపతి శని, జంతువు సింహము. ఈ రాశిలో జన్మించిన వారు మంచి బుద్ధికుశలత కలిగి ఉంటారు. వీరి తెలివి తేటలను సరిగా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శీఖరాలను సునాయాసంగా అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. వీరి అధికార వైఖరి, మెండి తనం కారణంగా విమర్శలను ఎదుర్కొనవలసిన పరిస్థితి అడుగడుగునా ఎదురౌతుంది. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు. ధనం పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు. కాని అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు. స్థిరాస్థుల రుపములోనె నిలబడతాయి. మేధావులుగా భావిస్తారు కాని ఆత్మియులకు చెప్పకుండా చేసే పనులు నష్టం కలిగిస్తాయి. దుష్టులకు భాగస్వామ్యం అప్పచెప్తారు. అందు వలన నష్తపోతారు. మధ్యవర్తి సంతకాల వలన, కోర్టు తీర్పుల వలన నష్టపోతారు. పైసాకు చెల్లని వ్యక్తులను నెత్తికి ఎక్కించు కుని అందలం ఎక్కించి కష్టాలు కొని తెచ్చుకుంటారు. చదువు, సంస్కారం ఉపయోగపడి మంచి అధికారిగా రాణిస్తారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉంటే పురోగమనం సాధించ వచ్చు. సంతానంను అతి గారాబం చేస్తే చేదు అనుభవాలు ఎదురౌతాయి. పెంపకంలో లోపాలు ఉన్నా సంతానం బాగుపడి కుంటుంబానికి ఖ్యాతి తెస్తారు. గురు, శని, బుధ, మహర్ధశలు, శుక్రదశ యోగిస్తాయి.


శతభిషానక్షత్రము గుణగణాలు 

ఇది రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు,  రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గలలొ స్నెహితులు ఉంటారు కాని వీళ్ళ వలన వారు ఉపయోగాలు ఆశించరు. సహోదరీ వర్గంతో, న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురౌతుంది. విద్య కొంతకాలం మందకొడిగా సాగినా క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంత కాలం కలసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమీషన్ ఏజెంటుగా, వ్యాపార వేత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్థుల వలన లాభాలు, చిక్కులు ఎదురౌతాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంత కాలం ఇబ్బందులు ఎదురౌతాయి. శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్ధిక సహాయం చెయవలసి ఉంటుంది. జూదం వలన జీవితంలో అపశృతులు ఉంటాయి. సంతానం మంచి స్థితి సాధిస్తారు. వారి కొరకు జీవితంలో అనేక సౌఖ్యాలను త్యాగం చెస్తారు. వివాహాది శుభకార్యాలు మొండికి పడినా  పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యం. ఆత్మియులతో అరమరికలు లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చెసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. బాల్యం కొంత జరిగిన తరువాత సౌఖ్యంగా జరుగుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వలన మార్పులు సంభవం. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ సాధారణ ఫలితాలు మాత్రమే.


 పూర్వాభద్రనక్షత్రము గుణగణాలు

పూర్వాభాద్ర నక్షత్రాధిపతి  గురువు, అధిదేవత అజైకపాదుడు, మానవగణము, జంతువు సింహము, రాశ్యాధిపతులు శని, గురువులు. ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఊంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు. తమకు అన్నీ తెలుసన్న భావన మంచి చేయదు. స్నేహాలు, విరోధాలు వెంట వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను ఎదుర్కొంటారు. ఆతురత వలన తగిన సమయం కొరకు ఎదురు చూసే ఓర్పు నశిస్తుంది. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పె వరకు వీరికి తెలియదు. సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. దేశదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అంది వస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. సంతానాన్ని అతిగారాబం చెస్తారు లేక పోతే విచక్షణా రహితంగా కొడతారు. ఆర్ధిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు. ఆధిపత్యపోరు ఇబ్బందికి గురి చేస్తుంది. వైవాహైక జీవితం సాధారణం. బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.


ఉత్తరాభద్రానక్షత్ర,ము గుణగణాలు 

ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని, రాశ్యధిపతి గురువు, మానవగణం, జంతువు ఆవు. ఈ నక్షత్ర జాతకులు వినయవిధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. గొప్పలు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు. కుటుంబ చరిత్ర తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. జివితం సాఫీగా జరిగి పోతుంది. ముప్పై నుండి నలభై సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఇది నక్షత్ర జాతకులు అందరికీ సామాన్య ఫలితాలు. జాతక చక్రములో గ్రహస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు చేర్పులు ఉంటాయి.


 రేవతీనక్షత్రము గుణగణాలు 
రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం, రాశ్యాధిపతి గురువు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదవేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది. ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్ట్టిచక్కగా నిద్రిస్తారు. స్నానం పట్ల మక్కువ ఎక్కువ. త్వరిత గతిన ఆర్ధిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపరంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించు కుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చెసే ఆత్మీయుల అండ దండ ఉండదు. ఒక వేళ ఉన్నా ప్రయోజనం ఉందదు. దూరప్రాంతాలలో  చదువుకుని స్థిరపడడా నికి బంధువుల సహకారం ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో వినూతన వ్యాపారాలలొ రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకు పోతారు. వీరికి జ్ఞాపక శక్తి , సాహిత్య రంగంలో అధికం. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి